అమ్మ కొడుకు

11/01/2011 10:00

 -మానస  ఎండ్లూరి

  పూలకి కొమ్మలే పూస్తాయో 

 మనిషి పుట్టాకే  మట్టి పుట్టిందో 

నేను మాత్రం


కొడుకు పుట్టాకే పుట్టాను 


వాడు నాకు జోల పాడుతాడు.    


అన్నం తినిపిస్తూ చందమామ అవుతాడు


నేను మౌనంగా ఉన్నప్పుడు 


నా గాజుల సవ్వడవుతాడు


నా వేకువ నిద్ర లో 


ద్రువనక్షత్రమై మెరుస్తాడు


వాడి కోసం కనే కలలు 


సెలయేరై ప్రవహిస్తున్నప్పుడు 


నా కళ్ళకు కాటుక వారధి అవుతాడు


నా కాలి గాయం 


వాడి కళ్ళలో నెత్తురై స్రవిస్తుంది 


నన్ను ఒంటరిని  చేసి  


కాలం వాకిట్లో


గడియారమై తిరుగుతున్నప్పుడు


వాడి జ్ఞాపకాలను 


ఓదార్పు వస్త్రంగా చుట్టుకుంటాను


దుఖ క్షణాల మధ్య 


చీర కుచ్చిళ్లు లెక్కిస్తూ  


పిట్టకథల పసి బాలుడవుతాడు


తన చిట్టి చేతులతో 


నా భుజం తట్టి 


గమ్యపు రహదారుల్లో నడిపిస్తాడు   


నా సృష్టి వాడే


నన్ను సృష్టించుకుందీ   వాడే.....