12 వేల మంది తోడుగా యాత్రచేసిన ఎమిలీ ఈడెన్, ఫానీ ఈడెన్

28/02/2011 10:48

భారతదేశానికి గవర్నర్  జనరల్ గా పని చేసిన జార్జి  (  లార్డ్ ఆఫ్ ఆక్ ల్యాండ్ )కి సొంత చెల్లెల్లె ఈ యాత్రికులు.  వీళ్ళు  ఇంగ్లాండ్  లోని విగ్ రాజ వంశానికి చిందిన వారైనా , చాలా సామాన్యంగా  జీవించడానికి ఇష్ట పడతారు. అందరిలాగా రాజభూగాలు అనుభవించటం  వారికి ఎప్పుడూ ఇష్టం లేదు. ఒక గొప్ప యాత్ర వలన  వారికి సాహిత్య చరిత్రలో స్థానం దొరికింది.  ఆ యాత్రా   రచనవలన మనకి   ఉత్తర భారతదేశపు రాజకీయ  చరిత్ర గురించి కూడా ఎన్నో కొత్త  విషయాలు తెలిశాయి . నిజానికి ఎమిలీ ఈడెన్ కి ప్రయాణాలంటే  అసలు పడదు .  కాని అనుకోని పరస్తితుల్లో అన్నయ్య జార్జిని ఇండియాకి గవర్నర్  జనరల్ గా నియమించటం తో అతనికి తోడుగా, జార్జికి వివాహం కాలేదు కాబట్టి,ఇండియా కి వస్తారు అక్క చెల్లెళ్ళు ఇద్దరూ.
అప్పటికే అమ్మా నాన్న మరణించినందువల్ల వారి  కుటుంబం అంతా విడిపోయింది. ఈ ముగ్గురు మాత్రం ఒకర్నొకరు విడిచి పెట్టకుండా ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు.ఇండియాకి వచ్చేనాటికి ఎమిలీ వయస్సు 38 సం"లు . పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయాన్ని తన 29 వ సం' లో తీసుకున్న విజ్ఞాని."I  am  more and more confined in the idea that a life of single blessedness is the wisest "  (ఆనందంగా, ఒంటరిగా ఉండటమే తెలివైన నిర్ణయం ) అని అందరితో చెప్పేది కూడా. ఈమెకి ఎంతోమంది గొప్పవారితో పరిచయం ఉన్నాసరే ఎప్పుడు ఎవరితోనూ పెళ్లి ప్రస్తావన తెచ్చేది కాదు . పెళ్ళిచేసుకుంటే కుటుంబ సభ్యుల భారం కింద నలిగిపోవటంతప్పదు. అది ఇష్టం లేక తన అన్నయ్యకి రాజకీయ సలహాదారుగా ఉండిపోయింది. ఇంగ్లండులో విగ్ పార్టీ సమావేశాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ వుండేది. ఆమె తెలివైన సలహాలకోసం పెద్ద అధికారులు కూడా వేచి ఉండేవారు.
                 జార్జి, ఎమిలీ, ఫానీలు 1836  సం'  ఫిబ్రవరి లో బాంబేలో ఓడ దిగి కలకత్తా చేరుకొంటారు. ఈ ప్రయాణం అంతా దాదాపు 5 నెలలు పడుతుంది అప్పటికి సూయజ్  కాలువ నిర్మించలేదు కాబట్టి ఆఫ్రికా ఖండానికి దక్షిణపు కొస ఐన గుడ్ హోప్  అగ్రం చుట్టూ తిరిగి రావాల్సి ఉంది. (1869  వ   సం" లో సూయజ్ కాలువ నిర్మించారు. దీని పొడవు  190 కిలోమీటర్లు . ఇది నిర్మించాక ఇంగ్లండు-ఇండియా ప్రయాణీకులకి 9 ,700 కిలోమీటర్ల దూరం కలసి వచ్చింది.)
                కలకత్తా చేరుకున్నాక జార్జికి అసలు తీరిక దొరకకుండా పోతుంది .ఈ ఆమ్మాయిలు  ఇద్దరికీ నగరంలోని వేడి అసలు పడదు. చీటికిమాటికి బయటకు వెళ్లి తిరుగుదామనిపించేది.ఇతరులు ఏమైనా అనుకుంటారేమో నని సిగ్గుపడేవారు. వారు మంచి చిత్రకారులు కాబట్టి ఇంట్లోనే ఉండి తమకు నచ్చిన స్కెచ్ లు , బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేసే వారు.  
    ఎమిలీ అయితే ప్రతి నిమిషాన్ని విసుగ్గానే గడుపుతుండేది. ఇంగ్లాండు లో మాదిరిగా ఇక్కడ రాజకీయాల్లో పాల్గొ   నలేకపోవటం మాత్రమే దీనిక్కారణం. తిరిగి ఇంటికి వెళ్ళాలనే ధ్యాస ఎక్కువ అవుతుంది. హాయిగాసొంత ఇంట్లో ఉండక, ఇక్కడికి వచ్చి ఈ ఎండల్లో ఎందుకీ బాధ అనుకునేది. తను వెళ్లి పోతే తన చెల్లెలు ఒంటరిగా ఉండాలి. అసలే ఆమెకి
అనారోగ్యం . ఇలాగ సతమతమవుతూ ఉండగానే బోలెడంత కాలం కదలి పోయింది.
 
          ఫానీ కీ సమస్యలు ఉన్నాయి. కొత్తగా తన చుట్టూ అలుముకుంటున్న బ్రిటిషు వాతావరణం , ఆంగ్లో ఇండియన్ల కృత్రిమ స్వభావాలు ఆమెకి  విసుగు, చిరాకు తెప్పిస్తాయి. ఆఫీసర్లు, వారి అందమైన మాటలు, తెచ్చి పెట్టుకున్న వేషాలు ఇవన్నీ ఆమెకు నచ్చవు. బొమ్మలు వేయడం విసుగు అనిపించినప్పుడు కొత్త ఆటవస్తువులు తయారు చేసి, వాటితో తనే హాయిగా ఆడుకునేది.