దగాపడ్డ అమ్మ

11/01/2011 10:05

 -చల్లపల్లి స్వరూపరాణి

అమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా

వరినాటుకు  పొలం వెళ్లి 
 
అక్కడ పెట్టిన

రెండు కొబ్బరి ముక్కల్ని కూడా

నోట్లో వేసుకోకుండ 

చీర కొంగులో జాగ్రత్తగా కట్టి   

నాకోసం తీసుకొచ్చిన

నా పిచ్చి తల్లి రూపం

కన్నీటి తెరల మధ్య

 కదులాడుతుంది  
 
పొలాల్లో పశువుల కొట్టాల్లో

పరాభవాలు పొందిన అమ్మ

సర్పంచ్ ఇంటిముందు

పంచాయితీ ఆఫీసు బయట 

సొమ్మసిల్లిన అమ్మ

మైక్రో ఫైనాన్స్ వేధింపులను 
 
    
పళ్ళబిగువున భరించిన  అమ్మ

మాకడుపులు నింపడానికి

పేగులు మాడ్చుకున్న అమ్మ

మూడుముక్కల అతుకుల చీరతప్ప

కప్పుకోడానికి

ఒంటి నిండా బట్టలు లేని అమ్మ

కూలీ పెంపు కోసం 

ధర్నాలు చేసి జండాలు మోసి

లాటీ దెబ్బలు తిన్న అమ్మ
   
కాసింత మనిషితనం కోసం
 
బతుకంతా పడిగాపులు పడిన అమ్మ

త్యాగాల చరిత్రలో

నాలుగక్షరాలకు నోచుకోని అమ్మ

ఆమె గుర్తుకొస్తే 

నేనో కన్నీటి ఉప్పెనవుతాను 

పాకీపనులు  పాచి   పనులు చేసి

దగాపడిన అమ్మ చేతుల్ని

నా కవిత్వం తనివితీరా ముద్దాడుతుంది.